న్యూఢిల్లీ: తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికకు రెండు రోజులపాటు ఇక్కడ నిర్వహించిన ఇంటర్వ్యూలకు హాజరైన 28 మంది యువజన కాంగ్రెస్ నేతలకు ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. ఏఐసీసీ సంయుక్త కార్యదర్శి కృష్ణ అల్లవారు, యువజన కాంగ్రెస్ జాతీయ కమిటీ తాత్కాలిక అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి జేబీ మాథుర్ వీరిని ఇంటర్వ్యూ చేశారు. (పారాసిటమాల్ మింగి.. దర్జాగా ఇంటికి..!)
తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మీరు ఏరకంగా సమర్థులు? పదవి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు? మీకు కాని పక్షంలో ఎవరిని ఈ పదవికి సూచిస్తారు? వంటి సాధారణ ప్రశ్నలు అడిగారు. అయితే ఇందులో మరో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. కొత్తగా పీసీసీ అధ్యక్ష పదవికి మీరు ఎవరిని సూచిస్తారని ప్రశ్నించినట్లు సమాచారం. వీరిలో ఎక్కువగా రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబుల పేర్లను సూచించినట్లు తెలిసింది. (ఇక్కడే ఉండి పోరాటం చేస్తా: రేవంత్)